మనం ఎదుగుతున్న క్రమంలోనే కాదు, ఎదగాలనుకున్న సందర్భంలోనూ చాలా మంది కిందికి లాగాలని ప్రయత్నిస్తారు. అగౌరవ పరుస్తారు. అయితే వాటన్నిటినీ సహిస్తూ, భరిస్తూ కూర్చుంటే ఎదిగే సమయం ఎక్కడుంటుంది? అందుకే ధిక్కరించి ఎదగాలి అని అంటున్నారు నటి ప్రియాంక చోప్రా. మనసులో మాటలను ఉన్నదున్నట్టుగా చెబుతారనే పేరుంది దేశీ గర్ల్ ప్రియాంకకు. అసలు హాలీవుడ్‌కి వెళ్లాలనే ఆలోచన ప్రియాంకకు ఎందుకు వచ్చిందనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె చెప్పిన సమాధానం పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ``నన్ను బాలీవుడ్ ఓ మూలకు తోసేసింది. అందుకే నేను అక్కడి నుంచి యుఎస్‌కి బయలుదేరాలనుకున్నా. అంజులా ఆచార్య మ్యూజిక్ కెరీర్‌లో ఇంట్రస్ట్ ఉంటే రమ్మని ఆహ్వానించారు. నా అనుకున్నవాళ్లు నాకు అవకాశాలు ఇవ్వలేదు. నేను రాజకీయాలు చేయలేను. నాకు రాజకీయాలు చేయడం రాదు. అందుకే నేను కెరీర్‌లో బ్రేక్ తీసుకోవాలనుకున్నా. అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ నాకు మంచి అవకాశాలు కల్పించింది. వాటి కోసమే అమెరికా వెళ్లాలనుకున్నా.ఎవరూ నన్ను అందుకోలేనంత ఎదగాలనుకున్నా. కచ్చితంగా చేసి తీరుతాననే నమ్మకం నాకు కలిగింది. ఆ నమ్మకమే నన్ను సముద్రాలు దాటి ప్రయాణించేలా చేసింది`` అని అన్నారు.
ఓ వైపు మ్యూజిక్ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే కొన్ని ఉద్యోగాలను కూడా ప్రయత్నించాలనుకుంటన్నారు ప్రియాంక చోప్రా. అయితే దాంతో పాటే ఆమె నటిగానూ అవకాశాల కోసం ప్రయత్నించారు. అలా ప్రయత్నిస్తుండటంలో భాగంగానే క్వాంటికో సినిమా అవకాశం వచ్చింది. ఆమె నటించిన హాలీవుడ్ సిటాడెల్ త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగానే ఆమె పాడ్‌కాస్ట్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలోనే పలు విషయాలు మాట్లాడారు పీసీ. పీసీ తను ఎదగడం మాత్రమే కాదు, ఎదగాలనుకుంటున్న చాలా మంది అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు.